చురుగ్గా నైరుతి

     నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో జూన్‌9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు పలకరించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అలాగే 48 గంటల్లో ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో జూన్‌ 1వ తేదీకి కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు.


     పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. అలాగే ఆగ్నే య అరేబియా సముద్రాన్ని అనుకుని తూర్పు మధ్య ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో జూన్‌ 1వ తేదీనే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

     మరోవైపు ఏపీలో పలు చోట్ల పలుచోట్ల వాతావరణ అనిశ్చితి ఏర్పడింది.కోస్తాలో క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించాయి. దీంతో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో పిడుగులు పడడంతో నలుగురు మరణించారు. వంగర మండలంలో ముగ్గురు మరణించగా, సీతంపేట మండలంలో మరొకరు మృత్యువాత పడ్డారు.